Home > తెలంగాణ > కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిన్నటివరకూ జోరుగా ప్రచారం సాగించిన నేతలంతా రేపు జరగబోయే పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరికి ఓట్ల చీలిక గుబులు పట్టుకుంది. స్వతంత్రులు, రెబల్స్ ఏ పార్టీ ఓట్లు చీలుస్తారో.. ఎవరికి ముప్పు తెచ్చి పెడతారో తెలియక గందరగోళంలో పడ్డారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న వారికి, రెబల్ గా బరిలో దిగిన వారికి ఓ మోస్తారు ఓట్లే వచ్చినా… ఆ ఓట్లే తమ కొంపముంచబోతాయని చర్చిస్తున్నారు. దాదాపు 15 చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఫార్వర్డ్ బ్లాక్ , బీఎస్‌పీ, సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ కి లభించే ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సూర్యాపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసి, బిఎస్పి అభ్యర్థిగా చివరి నిమిషంలో బరిలోకి దిగిన వట్టే జానయ్య యాదవ్ చీల్చే ఓట్లు కీలకంగా మారనున్నాయి.

కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చివరి నిమిషంలో బరిలోకి దిగారు. ఇక్కడ గెలుపోవటములతో పాటు మూడో స్థానం ఎవరిది అన్నది కూడా ప్రధానాంశంగా మారింది.

నల్గొండలో బిఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పిల్లి రామరాజు యాదవ్ బరిలో ఉన్నారు. ఆయన చీల్చే ఓట్లు ఎవరిపై ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి నెలకొంది.

రామగుండం నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చే ఓట్లే రెండు ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బర్రెలక్కకు ఎక్కువ ఓట్లు వస్తే తమ భవిష్యత్తు ఏంటి అనేది ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాక బీఎస్పీ తరపున పోటీలో ఉన్న జగన్నాథరెడ్డికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్‌కు వచ్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

పటాన్ చెరు నుంచి బీఎస్పీ అభ్యర్థి నీలం మధు చీల్చే ఓట్లు కూడా ప్రముఖం కానున్నాయి.

గద్వాలలో నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజిత్ కుమార్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేశారు.

అదిలాబాదులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంజీవరెడ్డి స్వతంత్రంగా పోటీలోకి దిగారు. మరోవైపు ప్రధాన పార్టీ కాకపోయినా కాంగ్రెస్‌తో పొత్తు ఆశించి బంగపడ్డ సీపీఎం.. 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. సిపిఎం అభ్యర్థులతో భద్రాచలం, ఇబ్రహీంపట్నం, పాలేరు, మిర్యాలగూడ, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Updated : 29 Nov 2023 12:10 PM IST
Tags:    
Next Story
Share it
Top