Home > తెలంగాణ > పొగమంచుతో కన్పించని దారి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

పొగమంచుతో కన్పించని దారి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు

పొగమంచుతో కన్పించని దారి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
X

తెలంగాణలో పొగమంచు ప్రాణాలు తీస్తోంది. ఉదయంపూట దట్టంగా పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో దారి కన్పించక ప్రమాదాలకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లాలో అటువంటి ఘటనే జరిగింది. ఐదుగురు వ్యక్తులు అనంతగిరి హిల్స్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. శివారెడ్డిపేట దగ్గర పొగమంచుతో దారి కన్పించక కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ అమ్మాయి సహా ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. గుణశేఖర్ అనే వ్యక్తి మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.

మరోవైపు పొగమంచు కారణంగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. గత రెండు రోజుల క్రితంతో పోలిస్టే నిన్న రాత్రి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఉదయం 8 అయితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఇక సాయంత్రమైతే ఇళ్ల తలుపులు మూసి ఇంట్లోనే ఉండే పరిస్థితి నెలకొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.4 ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్లో 8, గిన్నెదరిలో 8, బేలలో 9.1, బజార్‌ హత్నూర్‌లో 9.3, నిర్మల్లో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated : 25 Dec 2023 5:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top