ఎన్నికల జిమ్మిక్కు.. మళ్లీ తెరపైకి పసుపు బోర్డు
X
తెలంగాణలో(నిజామాబాద్) పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలోని పసుపు రైతుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చే ఆలోచనలో ఉందని టాక్ నడుస్తోంది. ఈ నెల 17న పసుపు బోర్డుకి సంబంధించి ప్రకటన చేయటంతోపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు పెట్టే అవకాశం ఉందని.. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలలో ఒకరు నిజామాబాద్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి.. బీజేపీ హామీ ఇచ్చింది. తమ చిరకాల డిమాండ్ నెరవేరుతుందనే సంబరంలో జిల్లా ప్రజలు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ధర్మపురి అరవింద్ ను గెలిపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్‌లో సంతకం చేసి హామీ ఇవ్వడంతో ఓటర్లు ఆ మాట నమ్మి ఓటేశారు. అయితే నాలుగేళ్లు గడిచిన ఆ దిశగా అడుగులు పడలేదు. . 2014 పార్లమెంట్ ఎన్నికలలో సైతం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కవిత దాన్ని నెరవేర్చకపోవడంతో వందలమంది రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి ఆమె ఓటమికి కారణమయ్యారు. అదే ఎన్నికల్లో అర్వింద్ తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెప్పిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చి... ప్రజల చేత గెలుపొందారు. ఆ తర్వాత లోక్‌సభలో రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు సైతం ఈ అంశాన్ని ప్రస్తావించగా.. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. నిజామాబాద్ ప్రాంతంలో స్పైస్‌బోర్డు ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటుతో పసుపు రైతులకు సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో బీజేపీ మళ్లీ అన్నదాతలను మోసం చేసే ప్రయత్నాలకు తెరలేపింది. ఫలితంగానే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఏడాదిన్నర క్రితమే రాజ్యసభ, లోక్‌సభల్లో పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచనే లేదంటూ స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం… ఏ విధంగా ముందడుగు వేస్తుందనే ప్రశ్నగా మారింది. ఇచ్చేది లేదు… వచ్చేది లేదు… ఇదంతా ఎన్నికల గిమ్మిక్కు తప్ప మరొకటి లేదంటూ పసుపు రైతులు కొట్టి పారేస్తున్నారు.