రేపే లాస్ట్.. గృహలక్ష్మికి వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
X
ఇల్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువు ఆగస్టు 9తో ముగియనుంది. ఈ క్రమంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ నెల 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటి దశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనుంది.
10వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండో విడతలో పరిశీలించాలని నిర్ణయించారు. గృహలక్ష్మి పథకానికి జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. మండలాలు, పురపాలక సంఘాల ద్వారా సేకరించిన దరఖాస్తులను కలెక్టరు ఆఫీసుకు పంపిస్తారు. వాటిని పరిశీలించిన అనంతరం అర్హులైన లబ్ధిదారుల లిస్టు రెడీ చేస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి దశలవారీగా గృహలక్ష్మి ఇళ్లను మంజూరు చేస్తారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారిని పర్మినెంటు వెయిటింగ్ లిస్టులో ఉంచి తదుపరి విడతల్లో ఆర్థికసాయం చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం. 25 ప్రకారం దరఖాస్తుదారు పేరు మీద ఇంటి స్థలం ఉండాలి. ఆహార భద్రత కార్డు వారి లేదా వారి కుటుంబసభ్యుల పేరు మీద ఉండాలి. దరఖాస్తుదారు తప్పక అదే గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆర్‌సీసీ రూఫ్ ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. బాత్రూంతో కలిసి రెండు రూంలను ఆర్సీసీ స్లాబ్ తో నిర్మించి కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరు చేస్తారు.