దొంగతనాల్లో సెంచరీ.. ఎట్టకేలకు పోలిసులకు చిక్కిన ఘరానా దొంగ
X
బీఫార్మసీ చదువుకున్నాడు. చెడు సావాసాలకు దగ్గరయ్యాడు. ఓ కేసులో జైలుకెళ్లొచ్చాక దొంగగా మారాడు. 28 ఏళ్లకే చోరీల్లో సెంచరీ దాటాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఓయూ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి హిస్టరీ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్లబండ తండాకు చెందిన శంకర్‌నాయక్ గతంలో హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లొచ్చారు. జైలు నుంచి వచ్చాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో వాటి కోసం దొంగతనాల బాటపట్టాడు.
ఏపీ, తెలంగాణలోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో నింతుడిపై పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఓ ఇంట్లో 10 తులాల బంగారం ఎత్తుకెళ్తే 20 తులాలు చోరీ అయ్యాయంటూ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శంకర్ నాయక్ను పట్టుకోగా.. అతడు 10 తులాలే అని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. అప్పటి నుంచి మనోడు చోరీల స్టైల్ మార్చాడు. ఎక్కడ దొంగతనం చేసినా నగదు, నగలు వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఇలాగే చోరీలు చేశాడు. ఈ క్రమంలో అమీర్‌పేట్లో అనుమానస్పదంగా తిరుగుతున్న శంకర్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.13.50 లక్షల ఆభరణాలు, బైక్, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.