TET Result : టెట్ రిజల్ట్స్.. లక్షలో 25 వేలమంది కూడా పాస్ కాలే..
X
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నిన్న(సెప్టెంబరు 27) విడుదలైన సంగతి తెలిసిందే. (TET Result) ఈ ఫలితాల్లో పేపర్-1లో 36.89 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా.. పేపర్-2లో 15.30 శాతం అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 18.66 శాతం, సోషల్ స్టడీస్ విభాగంలో 11.47 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలతోపాటు సబ్జెక్టులవారీగా తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు.
అయితే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోవడం.. ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఉదయం 10 గంటలకు ఫలితాలను వెబ్‌సైట్లో పెట్టిన అధికారులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు కూడా ఉత్తీర్ణత శాతం వెల్లడించలేదు. జిల్లాల వారీగా, సామాజిక వర్గాలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వివరాలను ఇచ్చేందుకు నిరాకరించారు. పరీక్ష జరిగిన నాడు జిల్లాల వారీగా అభ్యర్థులు, హాజరు శాతాన్ని ప్రకటించిన అధికారులు ఇప్పుడు మాత్రం ససేమిరా అంటుండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అభ్యర్థులు.. గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల తదితర పరీక్షలకూ సన్నద్ధమవడంతో టెట్‌లో ఉత్తీర్ణత తగ్గిందని అనుకుంటున్నారు.
ఈ నెల 15వ తేదీన నిర్వహించిన టెట్ పరీక్షకు.. పేపర్-1కు 2,22,744 మంది, పేపర్-2కు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ఫలితాలను పరిశీలిస్తే.. పేపర్-1లో 82,489 మంది, పేపర్-2లో 29,073 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష జరిగిన నాడే పేపర్-2 ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, పేపర్-1 మాత్రం సులభంగా ఉందని కొందరు అభ్యర్థులు తెలిపారు. ఆ విధంగానే పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం మంది పాస్ అయ్యారు. టెట్ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదవడం ఇదే తొలిసారి.
టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.