Home > తెలంగాణ > Telangana Secretariat : SPF చేతికి తెలంగాణ సెక్రటేరియట్ భద్రత !

Telangana Secretariat : SPF చేతికి తెలంగాణ సెక్రటేరియట్ భద్రత !

Telangana Secretariat : SPF చేతికి తెలంగాణ సెక్రటేరియట్  భద్రత !
X

నూతన సచివాలయం ఏర్పాటైన తర్వాత సచివాలయ భద్రత వ్యవహారాల నుంచి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా ఎస్‌పీఎఫ్‌ను తొలిగించింది. తాజాగా మళ్లీ ఎస్‌పీఎఫ్‌కే ఆ బాధ్యతల్ని అప్పగించే యోచనలో కొత్త ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) విభాగం పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సచివాలయ భవనం ప్రారంభమైన తర్వాత నుంచి ఈ బాధ్యతల్ని చేపట్టిన టీఎస్‌ఎస్‌పీ .. సచివాలయ ఉద్యోగులతోపాటు సందర్శకులను లోపలికి అనుమతించే యాక్సెస్‌ కంట్రోల్‌ వంటి కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అలాగే కొత్త సచివాలయం నలువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీపోస్టుల్లో పహారా చేపడుతున్నారు.

హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతల విభాగం, సాయుధ రిజర్వ్‌ (ఏఆర్‌), ట్రాఫిక్‌ పోలీసులూ అంతా కలిపి అన్ని షిఫ్టుల్లో సుమారు 650 మంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ బాధ్యతలు ఎస్‌పీఎఫ్‌ పర్యవేక్షణలోనే ఉండేవి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ సమయంలో కార్యాలయాలు బీఆర్‌కే భవన్‌లో కొనసాగినప్పుడూ ఎస్‌పీఎఫ్‌ సిబ్బందే భద్రత కొనసాగించారు. అయితే నూతన సచివాలయం ఏర్పాటైన తర్వాత సచివాలయ భద్రత వ్యవహారాల నుంచి గత ప్రభుత్వం అనూహ్యంగా ఎస్‌పీఎఫ్‌ను తప్పించింది. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే అంశంపై అప్పట్లోనే స్పష్టత కొరవడింది. తాజాగా మళ్లీ ఎస్‌పీఎఫ్‌కే ఆ బాధ్యతల్ని అప్పగించే యోచనలో కొత్త ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఎస్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడినట్లు సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 27 Jan 2024 11:16 AM IST
Tags:    
Next Story
Share it
Top