BRS party Name: 'పేరులో తెలంగాణను తీసేయడం వల్లే ఓట్లు పడలేదు'
X
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ పార్టీ.. ఉద్యమ పార్టీగా మొదలై.. అనతికాలంలో రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రత్యేక రాష్టంగా తెలంగాణ ఆవిర్భించిన తొలినాళ్లలోనే ... ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్లపాటు తెలంగాణను పాలించింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ.. ఈసారి ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పార్టీకి దూరమైందని.. గత అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడిందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ మొదలైంది.
నిన్న(బుధవారం) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఒకటిరెండు శాతంమంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే ఆ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు విడిచిపెట్టాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను తిరిగి పార్టీ పేరుతో చేర్చే అంశాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం శ్రీహరి పార్టీ నేతలను కోరారు. మరి త్వరలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మార్చే సూచలు కనిపిస్తున్నాయి. మరీ దీని మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.