మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు
X
హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న మంత్రి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మంత్రిపై వేసిన మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది. ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాఘవేంద్ర రాజు. అయితే ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తిరస్కరిస్తూ, రాఘవేంద్ర రాజు పిటిషన్ ను విచారణకు అనుమతి ఇచ్చింది. 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్..ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈరోజే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు వేసింది తెలంగాణ హైకోర్టు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని అందించారని ఆయనపై రూ.5లక్షలు జరిమానా విధించింది. ఎమ్మెల్యే పదవికి వనమా ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. ఆయనపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.