KTR: మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..!!!
X
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది. రైతుల కోసం, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి.. ఎన్నికల వేళ మరీ ముఖ్యంగా గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా ఓటమి పాలవ్వడంతో తాము చేసిన పొరపాట్లను పున:పరిశీలించుకుంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఎదురైన పరాభవంతో.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా అగ్రనేత కేసీఆర్ పావులు కదుపుతున్నారని సమాచారం.
కవిత పోటీకి ఒప్పుకోని కేసీఆర్!!
లిక్కర్ కేసులో కూతరు కవితపై ఆరోపణలు ఉండడంతో.. క్లీన్ ఇమేజ్ ఉన్న కేటీఆర్ వైపే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బాగా ప్రచారం కావడంతో ఆమెను ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయించడం లేదు దీంతో కేటీఆర్ అయితేనే ఢిల్లీలో బావుంటుందనేది కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే... బీఆర్ఎస్ నుంచే ఢిల్లీ వేదికగా బలమైన గొంతుక వినింపించేందుకు కుటుంబంలోని వ్యక్తి ఉండాలని, అది కూడా తన కొడుకే ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా అటు లోక్‌సభలోనూ, ఇటు రాష్ట్రంలోని తమ పార్టీకీ మేలు జరుగుతుందని అపర చాణుక్యుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కే టీఆర్ ను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దింపితే, పార్టీలో జోష్ వస్తుందన్నది కేసీఆర్ ఉద్దేశం.
కేటీఆర్ ఆలోచన ఇదే..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉన్న ..హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు కేటీఆర్. ముఖ్యంగా ఐటీ మంత్రిగా తన మార్క్‌ను చూపెట్టి.. విద్యావంతులు, మేధావుల చేత శభాష్ అనిపించుకున్నారు. మహానగరంలో పెట్టుబడి పెట్టేందుకు బడా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపించారంటే అందుకు కేటీఆరే ప్రధాన కారణమంటారు ఐటీ జనాలు. ఆ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు గులాబీ అభ్యర్థులకే పట్టం కట్టారు. రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు గాను.. 5 చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడంతో.. డెవలప్ మంత్ర బాగా పని చేసిందని కేటీఆర్ కూడా అభిప్రాయపడ్డారు. ఇదే సూత్రంతో పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో ముమ్మర కసరత్తుకు శ్రీకారం చుట్టబోతున్నారు.
ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రిగా కేటీఆర్.?
పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు పాజిటివ్ టాక్ వస్తుండడంతో .. ఈసారి మోదీ ప్రభుత్వానికి సీట్ల సంఖ్య తగ్గుతుందని బీఆర్ఎస్ అంచనా వేసింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ పాలన తరువాత ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఉత్తరాదిలో బిజెపి ఎంతో కీలకంగా భావించే ఉత్తరప్రదేశ్‌లో కూడా లోక్‌సభ స్థానాలు గెలిచే అవకాశం బాగా తగ్గుతుందని ఇప్పటికే ఒక వాదన బలాన్ని ఊపందుకుంటుంది. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని, మెజార్టీ స్థానాల్లో గెలిస్తే తామే కీలకమవుతామని బీఆర్ఎస్ అధినేత నేత ఆలోచన. ఈ మేరకే మల్కాజ్ గిరినుంచి గానీ సికింద్రాబాద్ నుంచి గానీ కేటీఆర్ ను బరిలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. నగరంలో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు లభించిన నేపథ్యంలో, ఇక్కడ కేటీఆర్ గెలుపు నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు కేసీఆర్. కేటీఆర్ గెలుపు ఓటమిపై రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ కేటీఆర్ గెలిస్తే రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు.
గెలిస్తే ఒకలా .. ఓడితే మరోలా
ఇక రాష్ట్రంలో కేటీఆర్ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న సమావేశాలకు కేటీఆర్ హాజరవుతుండడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతుంది. శనివారం కూకట్‌పల్లి కుత్బుల్లాపూర్ సన్నాహాక సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్... ఇవాళ ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల సమావేశాలకు హాజరయ్యారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే, ఒక స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇక మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో మూడింటిలో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, నాలుగు స్థానాల్లో మాత్రమే కాస్తంత ఎక్కువ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో అయితే మల్కాజిగిరి, లేదంటే సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేటీఆర్ గెలిస్తే ఒకలా... ఓడితే మరోలా రాష్ట్ర రాజకీయాలు ఉండబోతున్నాయి.