Congress Prajapalana :అభయహస్తం వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్య.. దరఖాస్తుదారుల్లో ఆందోళన
X
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 28. 2014న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. అభయహస్తం కింద 1,08,94,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గృహలక్ష్మీ, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ప్రభుత్వం వీటిని నెలరోజుల్లో పరిశీలించి, లబ్దిదారుల లిస్ట్ ను రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వెబ్ సైట్ https://prajapalana.telangana.gov.inను ప్రారంభించారు. అయితే ఈ వెబ్ సైట్ లో ప్రస్తుతం టెక్నికల్ గ్లిచ్ (ప్రాబ్లమ్) ఏర్పడింది.
ఈ వెబ్ సైట్ లోని అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే.. https://prajapalana.telangana.gov.in/Applicationstatusలోకి వెళ్లాలి. ప్రజాపాలన కేంద్రాల వద్ద ఇచ్చిన రసీదు నెంబర్ ను అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది స్టేటర్ రూపంలో తెలుస్తుంది. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. అప్లకేషన్ లో రసీదు నెంబర్ ఎంటర్ చేశాక.. కాప్చా ఎంటర్ చేసి స్టేటస్ చూసుకోవాలి. అయితే చాలామందికి కాప్చా కోడ్ కనిపించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. రీ ఫ్రెష్ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా.. కొత్త కాప్చా రావట్లేదు. పోనీ దీనిపై కంప్లైంట్ ఇద్దామన్నా.. వెబ్ సైట్ లో కంప్లైంట్ ఆప్షన్ కూడా లేదు. అప్లికేషన్ అప్రూవ్ అయిందో లేదో తెలియక దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరీక్షించి, స్టేటస్ చూసుకునే వీలు కల్పించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.