ప్రజాపాలనకు అనూహ్య స్పందన.. పలుచోట్ల ప్రజల నిరసన
X
తెలంగాణలో నేటి నుంచి 'ప్రజా పాలన' కార్యక్రమం మొదలైంది. అధికార పార్టీ నేతలు, అధికారులు.. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా నేతలు హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. మరోవైపు, అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందడం లేదని పలు చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దళారులు జిరాక్స్ సెంటర్ల వద్ద రూ.50 నుంచి రూ.100 విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసేవా కేంద్రాల వద్ద ఉదయం నుంచి లైన్‌లో వేచిచూస్తున్నా.. అభయహస్తం దరఖాస్తు ఫామ్‌లు ఇవ్వడం లేదన్నారు.
కార్యక్రమం ప్రారంభించిన కేవలం 3 గంటల్లోనే నగరంలోని చాలా కౌంటర్లలో దరఖాస్తులు అయిపోయాయని, తిరిగి రేపు ఉదయం రావాలని సిబ్బంది సూచించడంతో ప్రజలు నిలదీశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ కు విచ్చేసిన ప్రజలు తమకు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని సిబ్బంది నిలదీశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ప్రజలను సముదాయించి పంపించారు. ఈ విషయమై కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, కార్యక్రమం మొదటి రోజు కావడంతో ఈ సమస్య తలెత్తిందని, రేపటి నుంచి కార్యక్రమానికి సజావుగా నిర్వహిస్తామని సమాధానం ఇచ్చారు.
8 రోజులు చాలవు..
మరోవైపు ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తులు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
ఒక్కొక్క సెంటర్లలో కేవలం 100 లేదా 200 మాత్రమే దరఖాస్తు ఫారాలు ఉన్నాయని, వేలమందిగా వచ్చే జనాలకు ఇవి ఎలా సరిపోతాయంటూ ప్రశ్నించారు. దరఖాస్తులో కొత్త పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి ఎలా వివరణ లేదన్నారు. ఈ కార్యక్రమం 8 పనిదినాల్లో అయ్యేది కాదని, కనీసం నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరగాలని మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ణప్తి చేశారు.