Telangana Highcourt: సంక్రాంతి తర్వాత హైకోర్టు పనివేళల్లో మార్పులు
X
రాష్ట్ర హైకోర్టు పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్న భోజన సమయం 1.30 నుంచి 2.30 దాకా ఉండగా ప్రస్తుతం 1.30 నుంచి 2.15కు సవరించారు. అదే విధంగా కోర్టు పనివేళలను సాయంత్రం 4.30 నుంచి 4.15కు కుదించారు. దీంతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.15 దాకా కోర్టు పనివేళలుంటాయని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. కాగా, ఈ పనివేళలు సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదిలా ఉండగా నేడు హైకోర్టులో వ్యూహం సినిమాపై విచారణ జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని దాఖలైన పిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టింది హైకోర్టు. నిన్న జరిపిన విచారణలో సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డును పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి విచారణ జరగనుంది.