స్వతంత్రుల పోటీతో ముప్పో.. 15 నియోజకవర్గాల్లో పార్టీలకు గుబులు!
X
ఈసారి ఎన్నికల బరిలో ఏకంగా 2వేల మందికిపైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇది ప్రధాన పార్టీలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాల్లో ఓట్లు చీలి ప్రధాన పార్టీకు దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ-జనసేన కూటమి, బీఎస్పీ ఇలా అన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు.. రెబల్స్‌గా నామినేషన్ వేశారు. చాలామంది నామినేషన్లు ఉపసంహరించుకున్నా కొన్ని చోట్ల బరిలో కొనసాగుతున్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్లుగా.. ఇంకొంతమంది ఫార్వర్డ్‌బ్లాక్, బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం, ఇబ్రహీంపట్నంతోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ పార్టీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. వీటిలోని పలు స్థానాల్లో గెలుపోటముల మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల బీఎస్పీ, సీపీఎం పార్టీలకు ఈ తేడా కంటే ఎక్కువ ఓట్లు రావొచ్చనే మాట వినిపిస్తుంది. అయిదు నుంచి పదివేల వరకు ఓట్లు పొందే స్వతంత్రులు పొందే అవకాశం ఉంది.
సిర్పూరు కాగజ్‌నగర్‌లో బరిలో ఉన్న బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. పెద్దపల్లిలో బరిలో ఉన్న దాసరి ఉష కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆమెకు మద్దతుగా బీఎస్పీలో చేరారు. ఉషకు వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రభావం చూపనున్నాయి.
కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్క (శిరీష) టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచారు. అమెకు మద్దతునివ్వడం కోసం చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి ప్రచారం చేశారు. ఆమె ఓట్లు చీల్చి ప్రధాన పార్టీలకు దెబ్బ కొట్టే అవకాశం ఉందని అభ్యర్థుల్లో నెలకొంది.
పటాన్‌చెరులో కాంగ్రెస్ టికెట్ దక్కని నీలం మధు ముదిరాజ్.. మక్తల్‌లో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన వర్కటం జగన్నాధరెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు సమస్యగా మారారు.