Accident: డివైడర్ను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
X
అంత్యక్రియలకు వెళ్లిన ఆ కుటుంబానికి అవే ఆఖరిచూపులయ్యాయి. ఊరి నుంచి మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యువు వెంటాడింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఖమ్మం గ్రామీణ మండలం తల్లంపాడు వద్ద జరిగిన ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి కుమార్తె కన్నుమూశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రామపురం శివారు ఎస్‌ఎంపేటకు చెందిన మందపల్లి సంతోష్‌కుమార్ ఖమ్మంలో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న సంతోష్‌కుమార్ పెద్దనాన్న రామయ్య చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సంతోష్ కుమార్ భార్యాపిల్లలతో పాటు స్వగ్రామానికి వెళ్లారు. శుక్రవారం అంత్యక్రియలు పూర్తైన తర్వాత సంతోష్ కుమార్ భార్య ఝాన్సీరాణి, కుమార్తెలు యోజిత, గగనతో పాటు సోదరుడి పిల్లలు హేమ లత శ్రీ, కోమర్ రావుతో కలసి కారులో ఖమ్మంకు బయల్దేరారు.
ఖమ్మం - సూర్యాపేట నేషనల్ హైవైపై తల్లంపాడు వద్ద సంతోష్‌కుమార్ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మంలోని ఓ హాస్పిటల్కు తరలించగా.. ఝాన్సీరాణి చికిత్స పొందుతూ చనిపోయారు. సంతోష్ కుమార్ కూమార్తె యోజితతో పాటు ఆయన సోదరుడి కూతురు హేమ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే యోజిత ట్రీట్మెంట్ తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూసింది. హేమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరి పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. కారు ప్రమాదానికి సంబంధించి సంతోష్‌కుమార్ తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.