తుమ్మల ఎపిసోడ్ కంటిన్యూ.. హైదరాబాద్కు ఖమ్మం బీఆర్ఎస్ నేతలు..
X
ఖమ్మం బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అంసతృప్తికి లోనైన తుమ్మల పార్టీ మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్లో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ఖమ్మం జిల్లాకు చెందిన నేతలను హైదరాబాద్ కు రావాలని పిలుపునిచ్చింది.
అధిష్టానం పిలుపుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ బయలుదేరారు. పోటీలో ఉంటానని తుమ్మల స్పష్టం చేయడంతో రాజకీయ పరిణామాలపై కేసీఅర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. తుమ్మల రాజకీయ నిర్ణయం దాని ప్రభావంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ మంతనాలు చేయనున్నారు.
వచ్చే ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో హైకమాండ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల.. శుక్రవారం భారీ ర్యాలీగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు. జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం నుంచి భారీ ర్యాలీగా ఖమ్మం నగరంలోని తన నివాసానికి చేరుకుని అక్కడ జరిగిన సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించామని అనుకుంటున్న వారిది తాత్కాలిక ఆనందమేనని, ప్రజల అభిమానం, అండదండలు ఉన్నంతవరకు తనను ఎవరూ ఏగ చేయలేరని అన్నారు.