Tummala Nageswara Rao : బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ మంత్రి తుమ్మల రాజీనామా
X
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఆయన పార్టీలో చేరడం ఖరారయ్యింది. దీంతో తాజాగా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ పంపించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇన్నాళ్లూ నాకు సహకరించినందుకు ధన్య వాదాలు... పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాజీనామా లేఖను తుమ్మల ముగించారు.
ఇక ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలోనే తుమ్మల హస్తం గూటికి చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు బీజేపీకి చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. ఇన్నాళ్లూ BRSకి తుమ్మల రాజీనామా చేస్తారన్న వార్తలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆయనే రాజీనామా లేఖ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపారు
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు 1982లో తెలుగు దేశం పార్టీలో చేరారు. 1983లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1985లో తొలి సారి సత్తుపల్లి నుంచి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999లో టీడీపీ సత్తుపల్లికి ప్రాతినిథ్యం వహించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు.