CM Revanth Reddy, : తెలంగాణలో నేడే మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు ప్రారంభం.. చేవెళ్లలో శ్రీకారం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో మరో రెండు గ్యారంటీలకు ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టబోతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరగబోయే సభలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాలను కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వర్చువల్ గా ప్రారంభించనుండగా, ఇప్పటికే హస్తం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభలో సీఎం.. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకు గ్యాస్ సిలిండర్ హమీలను ప్రారంభిస్తారు. సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది.
ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రియాంక రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు.