అసెంబ్లీకి పోటీ చేస్తున్నా.. నిర్మాత అప్పిరెడ్డి
X
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, సంఘసేవకుడు అన్నపరెడ్డి అప్పరెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కోదాడ, హుజూర్ నగర్‌ల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నానని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారంతో ముగియనుండడంతో ఆయన దరఖాస్తు చేసి మీడియాతో మాట్లాడారు. పీసీసీ మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి పోటీ నుంచి తప్పుకుంటే తను బరిలోకి దిగుతానని అప్పిరెడ్డి తెలిపారు. ఉత్తమ్, పద్మావతి దరఖాస్తు చేసుకున్న స్థానాల్లో అప్పిరెడ్డి కూడా టికెట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల్లో ఏదో ఒకచోట తనకు టికెట్ ఇస్తామని ఉత్తమ్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ‘‘నాకు టికెట్ ఇస్తే పోటీచేస్తాను. ఉత్తమ్ దంపతులు పోటీచేసినా నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వారికి పూర్తి మద్దతిస్తాను’’ అని చెప్పారు. ‘జార్జిరెడ్డి’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో టాలీవుడ్‌లో కొత్త పంథాను ఆవిష్కరించిన అప్పిరెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామం. ఉన్నత చదువులు చదివిన ఆయన విదేశాల్లో ఐటీ కంపెనీలు స్థాంపించి మళ్లీ స్వదేశానికి వచ్చారు. ‘అప్పిరెడ్డి ఫౌండేషన్’ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంగా ఎంతో కృషి చేశారు. ప్రజలకు మరింత సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అప్పిరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తమ్ రెడ్డి నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉపఎన్నికల్లో పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ విధానాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుండడంతో తనకు కోదాడ, హుజూర్ నగర్‌లలో ఎక్కడో చోట అవకాశం కల్పిస్తారని అప్పిరెడ్డి ధీమాగా ఉన్నారు.