టమాటకు బదులుగా ఇవి వాడండి..
X
సలాడ్‌ల దగ్గరి నుంచి సూప్‌ల వరకు ప్రతి వంటకంలో టమాటాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఆహార తయారీలో భారతీయలు విస్తృతంగా ఉపయోగించే కూరగాయ టమాట. అయితే గత వారం రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు టమాట ధరలు మండిపోతున్నాయి. కొండెక్కి కూర్చున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, ఆకాశాన్నంటిన రేట్లతో టమాటాను కొనడం కొంచెం కష్టమే. ఈ క్రమంలో టమాటాకు ప్రత్యామ్నాయాలను వినియోగించడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పక తప్పదు. వంటకు మంచి రుచి, రంగు ఇవ్వడానికి టమాటాలకు బదులుగా చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఎలా వాడాలో మనమూ తెలుసుకుందాం.
చింతపండ గుజ్జు :
వంటకాల్లో చాలా మందికి పులుపు ఇష్టం. అందుకే వంటల్లో పులుపుదనం కోసం టమాటను వాడుతుంటారు. టమాటాలకు బదులుగా పులుపుదనం కోసం చింతపండు గుజ్జు వాడినా మంచి వంటకానికి మంచి టేస్టుని ఇస్తుంది. ఇది కూరకు పులుపు దనంతో పాటు, చిక్కదనం కూడా ఇస్తుంది. పప్పు, కూర లేదా స్టైర్-ఫ్రైస్ వంటి వంటలలో టమాటాలకు ప్రత్యామ్నాయంగా చింతపండు గుజ్జు లేదా పేస్ట్ వేసుకోవచ్చు.
వినిగర్తో భళే రుచి :
టమాటాలకు ప్రత్యామ్నాయంగా వినిగార్ను కూడా వాడొచ్చు. వినిగర్ డిష్‌కి పుల్లని, ఘాటైన రుచిని ఇస్తుంది. టమాటాలు ఎక్కువగా వాడాల్సిన డిష్‌లో వినిగర్‌ను వినియోగిస్తే సరిపోతుంది. టొమాటోలకు బెస్ట్ ప్రత్యామ్నాయం వినిగార్. యాపిల్ సైడర్ వెనిగర్‌లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాదు పేగు ఇన్ఫెక్షన్ను, డయేరియాతో పోరాడడంలో సహాయపడతాయి.
ఉసిరి, ఆమ్‌చూర్ పొడులు :
ఉసిరి , ఆమ్‌చూర్ పొడులు వంటకానికి పుల్లదనాన్ని అందిస్తాయి. ఇవి కూరలకు మంచి రుచని ఇస్తాయి. కూరకు పులుపు టేస్ట్ రావాలనుకునే వారు టమాటాలకు బదులుగా ఈ రెండు పొడుల్లో ఏదో ఒక పొడిని చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇవి టమాటాకు బెస్ట్ రీప్లేస్‌మెంట్ అనొచ్చు.
ఉల్లిగడ్డల పేస్ట్ :
కర్రీలో గుజ్జు కోసం టమాటాలను ఎక్కువగా వాడేవారు ఉల్లిగడ్డలను వినియోగించండి. ఉల్లిపాయలను నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేసుకుని కూరల్లో వేసుకుంటే మంచి గ్రేవీ తయారవుతుంది. అయితే మరీ ఎక్కువగా వినియోగించకుండా తక్కువగా వాడితేనే కూర ఘాటుగా ఉండకుండా, టేస్ట్ మారిపోకుండా ఉంటుంది.
పచ్చి మామిడి ముక్కలు :
టమాటాకు ప్రత్యామ్నాయంగా కూరల్లో పచ్చి మామిడి కాయలను ముక్కలను వాడవచ్చు. మామిడి ముక్కలను గుజ్జుగా చేసి కర్రీలో వేస్తే.. టేస్ట్ బాగా ఉంటుంది.
రంగు కోసం క్యాప్సికమ్ :
కూరకు మంచి కలర్ రావడానికి టమాటాను వేస్తారు. అదే రంగు టమాటాకు బదులుగా ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను వినియోగించవచ్చు. శ్యాండివిచ్, బర్గర్ వంటి వంటల్లో టమాటాకు ప్రత్యామ్నాయంగా రెడ్ క్యాప్సికమ్ వాడవచ్చు. స్నాక్స్, సలాడ్స్‌లోనూ టమాటకు బదులుగా టమాట కెచప్‌ని వినియోగించవచ్చు.