Telangana Holiday : రేపు స్కూళ్లకు సెలవు.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ
X
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఉత్సవమైన నాగోబా జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. మేడారం తర్వాత అంతటి పేరుగాంచిన జాతర ఇది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. జాతరలో భాగంగా సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు అదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 12కు బదులుగా మార్చి 9న ( రెండో శనివారం) వర్కింగ్ డే ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ నెల 15న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. సేవాలాల్ తన రచనలతో ప్రజలను జాగృతం చేశారు. ప్రధానంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. ఇక ఆయన జయంతిని బంజారాలు ప్రతి ఏటా అట్టహాసంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆయన జయంతిని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నా అటు కేంద్రం ఇటు రాష్ట్రం స్పందించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది.