Revanth Reddy: హైకోర్టును ఆశ్రయించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు ఇచ్చేలా డీజీపీని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఈ నెల 3న డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారని అందులో రాశారు. అయితే డీజీపీ మాత్రం దానిపై స్పందించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనకు అవసరమైన ఆ వివరాలను అందించేలా డీజీపీని ఆదేశించాలని కోరారు.
పిటిషన్‌పై విచారణ జరిగిన హైకోర్టు ధర్మాసనం పోలీసుల తీరును తప్పుబట్టింది. సమాచారం లేకపోతే నామినేషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 16 తేదీలోగా రేవంత్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.
నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అఫిడవిట్‌లో అన్ని వివరాలూ సమర్పించాల్సి ఉంటుంది. తమ నేర చరిత గురించి న్యూస్ పేపర్లు, టీవీ చానళ్ల ద్వారా ప్రజలకు మూడుసార్లు వెల్లడించాలి. ఈ క్రమంలోనే తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. అయితే స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.