మామా అల్లుళ్లు కలిసి దుబ్బాక నిధులు సిద్ధిపేటకు తరలిస్తున్నరు - రేవంత్ రెడ్డి
X
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్లిద్దరూ దుబ్బాక నిధులను సిద్ధిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించినా ఫలితం లేకుండా పోయిందన్న ఆయన.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్న రఘునందన్ రావు నియోజకవర్గం కోసం పైసా తీసుకురాలేదని మండిప్డాడరు. ఉప ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టిన రఘునందన్ రావుకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉందే తప్ప మిగతాదంతా పాత చింతకాయ పచ్చడే అని రేవంత్ అన్నారు. ఆయనను రెండుసార్లు ఎంపీగా గెలిపించినా నియోజకవర్గం కోసం ఏం చేయలేదని నిలదీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు నిధులు ఎందుకు తీసుకురాలేదన్న రేవంత్.. రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డిగ్రీ, పీజీ కాలేజీలు, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇప్పించలేదని నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగులు పెరిగారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. భూమి ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.