బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావు : రేవంత్ రెడ్డి
X
టీడీపీలో తాను చంద్రబాబు నాయుడుకు శిష్యుడిని కాదని.. సహచరుడినని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ టీడీపీలో కేసీఆర్ ప్రస్థానం చంద్రబాబు అనుచరుడిగా మొదలైందని ఆరోపించారు. అప్పట్లో నిలువ నీడ లేని కేసీఆర్కు టీడీపీనే ఆధారమైందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేకపోతే కేసీఆర్ సహా ఆయన కుటుంబం అడుక్కుతినేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ను, తనను తిట్టడానికే కేసీఆర్, కేటీఆర్ శాసనసభను వాడుకున్నారని రేవంత్ ఆరోపించారు. లాలూచీలో కేసీఆర్ను మించినవారు ఈ దేశంలో లేరన్నారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణ వ్యతిరేకి అంటే తెలంగాణ సమాజం నమ్మదని.. తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో తానేప్పుడూ ముందే ఉన్నానని వివరించారు.
గద్దర్ స్ఫూర్తితో ముందుకు..
గద్దర్ చివరి కోరికను నెరవేర్చేందుకు తాము కృషి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 2019లో కేసీఆర్కు వ్యతిరేకంగా గద్దర్ మొదలుపెట్టిన తుదిదశ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తితో ముందకు తీసుకెళ్తామన్నారు. గద్దర్ తన చివరి రోజుల్లో కీలక సూచనలు చేసినట్లు రేవంత్ చెప్పారు. ‘‘నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని వారితో వ్యూహాత్మంగా యుద్ధం చేయాలని గద్దర్ నాకు సూచించారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటిషియన్ అని.. ఆయనతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండమన్నారు’’ అని రేవంత్ తెలిపారు.
ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడితే.. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడ్డారని రేవంత్ అన్నారు. గద్దర్ చనిపోతే కేసీఆర్ అసెంబ్లీలో నివాళులు అర్పించకపోవడం సిగ్గచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 25సీట్లకు మించి రావు అని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. చర్చకు ఎవరు వస్తారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఇక లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని స్పష్టం చేశారు.