నేను జైలుకు వెళ్లడానికి ఆయనే కారణం.. నమ్మక ద్రోహం చేసిండు : రేవంత్
X
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకుర్తి విజయభేరి సభలో ప్రసంగించిన రేవంత్.. తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి కారణమన్నారు. అప్పట్లో శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించి.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దయాకర్ దందాలు చేస్తే.. ఝాన్సీరెడ్డి కుటుంబం పేదలపట్ల దయతో వ్యవహరిస్తున్నారని రేవంత్ చెప్పారు. ఝాన్సీరెడ్డి చేస్తున్న సేవలను సైతం అడ్డుకున్నారని ఆరోపించారు. అయినా ఝాన్సీ రెడ్డి వెనక్కి తగ్గకుండా తన కోడలిని ఎన్నికల బరిలో నిలిపారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను అందరూ గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇస్తుందని నిరూపిస్తే.. తన నామినేషన్ను వెనక్కి తీసుకుంటానని రేవంత్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు చేస్తున్నారని.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాజ్యసభ సీట్లు కేసీఆర్ వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే నమ్మకం.. కేసీఆర్ అంటే అమ్మకమని రేవంత్ అన్నారు. పాలకుర్తి అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.