పొన్నాల రాజీనామా.. రేవంత్ రియాక్షన్ మామూలుగా లేదుగా..
X
కాంగ్రెస్ సీనియర్ నేతల పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి రాజీనామా చేయడం పొన్నాల చేసిన అతిపెద్ద నేరమన్నారు. అభ్యర్థులు ఖరారు కాకముందే రాజీనామా చేయడం వెనుక ఉద్ధేశ్యం ఏంటని ప్రశ్నించారు. పార్టీ హైకమాండ్ కు పొన్నాల, కొమ్మూరి పేర్లు పంపించామని.. సీఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పొన్నాల గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
పొన్నాల తన తప్పు తెలుసుకుని రాజీనామాను ఉపసంహరించుకోవాలని రేవంత్ సూచించారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని.. మంత్రి పదవితోపాటు పీసీసీ పదవిని కట్టబెట్టిందని చెప్పారు. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఈ వయసులో రాజీనామా చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. మంచి రోజు చూసి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఈ సునామీలో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నాయని.. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. డీజీపీ అంజనీ కుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు, భుజంగరావులు బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈసీ వెంటనే వారిని తొలగించాలని ఆదేశించారు.