కాంగ్రెస్లో చేరికలు ప్రజలకు మేలు చేస్తాయ్ : రేవంత్
X
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరముందన్నారు. జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో రేవంత్, కోమటిరెడ్డి కలిశారు. జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన సానుకూలంగా స్పందించారని రేవంత్ చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గురునాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్లో చేరారని.. కానీ వారి ఆశలు తొమ్మిదేళ్లైనా నెరవేరలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావని.. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ను నుంచి చాలామంది పార్టీలో చేరుతారని.. ఆయా జిల్లాల స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్కు వ్యతిరేకంగా చాలామంది గళం విప్పుతారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 15 ఎంపీ స్థానాలను గెలిచి సోనియాకు గిఫ్ట్గా ఇస్తామన్నారు. 2024లో రాహుల్ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నవారి చేరికలపై కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరాలు చెబుతున్నారన్న ఆరోపణలపై రేవంత్ స్పందించారు. కోమటిరెడ్డి,ఉత్తమ్, జానారెడ్డిలకు తెలియకుండా చేరికలు జరగడం లేదని స్పష్టం చేశారు.
అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రేవంత్ కలిశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేరికలపై ఉన్న అభ్యంతరాలపై ఇరువురు నేతలు చర్చించారు. భేట తర్వాత చేరికలపై తమ మధ్య ఎటువంటి విభేధాలు లేవని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.