Reventh Reddy : తెలంగాణ కాంగ్రెస్కు ప్రాధాన్యత పెరిగింది
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగిందన్నారు. అయితే వ్యక్తులకు కాదని పార్టీకి అని స్పష్టం చేశారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్‌కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చన్నారు.గతంలో చేయని కార్యక్రమాలు ఈ రెండేళ్లలో నిర్వహించినట్లు చెప్పారు.
తాను పీసీసీ చీఫ్ అయ్యాక అధిష్టానంతో కొట్లాడి నాయకులకు పదవులు తెస్తున్నట్లు చెప్పారు. 2021వరకు 156 మంది నాయకులు పార్టీని వీడారని అన్నారు. 2021 నుంచి ఇప్పటివరకు పార్టీ మారని వాళ్ల లెక్క తీస్తే విషయం అర్ధమవుతుందన్నారు. ఇప్పుడు ఇతర పార్టీల్లోని అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి చర్చలు జరిపారు... ఆ తరువాత ఇప్పుడే వారు వచ్చి చర్చలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు.
తాను పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రానికి ఎంతోమంది జాతీయనాయకులు వచ్చారని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ నిర్వహించిన సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయిందని విమర్శించారు. గజ్వేల్, ఖమ్మం, ఇంద్రవెల్లి వంటి సభలు కేసీఆర్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలపై కేసీఆర్ మోదీతో ఒప్పందం చేసుకున్నారని.. అందుకే జనవరిలోనే ఎన్నికలు వస్తాయని ఆయన భావిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.