కేసీఆరే టార్గెట్.. కామారెడ్డి ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి..!
X
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. గజ్వేల్లో కేసీఆర్పై బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారు. ఇటు కామారెడ్డిలో కేసీఆర్కు ఝలక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కేసీఆర్పై పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు సమాచారం. రేవంత్ ఇప్పటికే కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.