అధికారంలోకి వస్తే కచ్చితంగా ధరణి రద్దు చేస్తాం - రేవంత్ రెడ్డి
X
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ధరణిని రద్దుచేస్తామని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిని మించిన అత్యాధునిక విధానాన్ని తీసుకొచ్చి భూములకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజన భూములకు రక్షణ ఉండదని అన్నారు. ధరణిపై 12వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. దోపిడీని ప్రశ్నిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ముందు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు.
ఏటీఎంలా మారిన ధరణి
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని రేవంత్ ఆరోపించారు. ధరణి ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో లెక్కలు చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారని, అలాంటప్పుడు ధరణి రాక ముందు నుంచి అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎలా అమలు చేశారని చెప్పారు. రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలుచేస్తారన్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ధరణిని దోపిడీకి వాడుకుంటున్నారని అన్నారు. ధరణి వచ్చాక 35లక్షల ఎకరాల దళిత, గిరిజన భూముల్ని కొల్లగొట్టారని, కేసీఆర్ దళారీగా మారి వేల మంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారని విమర్శించారు.
బేటీ వెనుక మతలబేంటి..?
గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వారిద్దరి సమావేశం వెనుక ఏం రహస్యం ఉందని ప్రశ్నించారు. గవర్నర్, సీఎంలు ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా వ్యవహరించారని, రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అగాధం ఉన్నట్లు కేసీఆర్ నమ్మించారని మండిపడ్డారు. ఒకవేళ వారిద్దరూ ప్రజాసమస్యలపై మాట్లాడి ఉంటే అందరి ముందు మాట్లాడుకోవచ్చు కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ను ఇన్నాళ్లు బీజేపీ అధ్యక్షురాలు అన్న కేసీఆర్ ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ అన్నారు. మోడీకి అసదుద్దీన్ ఓవైసీ చోటా భాయ్ అని సటైర్ వేశారు.