అన్నం పెట్టిన కాంగ్రెస్కు దానం సున్నం పెట్టిండు.. ఈ సారి ఓటమే.. : రేవంత్
X
పేదల గుండెల్లో పి.జనార్ధన్ రెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ అనగానే ఇద్దరే గుర్తొస్తారని.. ఒకరు ఖైరతాబాద్ గణనాథుడు ఇంకొకరు పీజేఆర్ అని చెప్పారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా ఫిల్మ్‌నగర్ బస్తీలో రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత పీజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందని.. విజయమ్మకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
దానం నాగేందర్ హైదరాబాద్ను సగం ఆక్రమించుకున్నారు కానీ.. పేదలకు చేసిందేమి లేదని రేవంత్ విమర్శించారు. అన్నం పెట్టిన కాంగ్రెస్కు నాగేందర్ సున్నం పెట్టారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి చింత రామచంద్రారెడ్డి పాత చింతకాయ పచ్చడి అంటూ ఎద్దేవా చేశారు. పీజేఆర్ హయాంలోనే ఇక్కడి పేదలకు ఇళ్లు వచ్చాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. ఈ సారి విజయారెడ్డిని గెలిపిస్తే.. మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు.