జోరు పెంచిన కాంగ్రెస్.. విబేధాలపై క్లారిటీ ఇచ్చిన రేవంత్
X
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఫలితాల అనంతరం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులకు గాలం వేసే పనిలో రాష్ట్ర నేతలు బిజీగా ఉన్నారు. అయితే నల్లగొండలో కొందరు నేతల చేరికపై ఆ జిలాలకు చెందిన సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ ముగ్గురికి చెప్పకుండా పార్టీలో ఎవరినీ చేర్చుకోమని స్పష్టం చేశారు.
సీనియర్ల గుస్సా
నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేములు వీరేశం, కోదాడ బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామంపై సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరేశం, శశిధర్ రెడ్డి చేరికపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేతలు, కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని వాపోయినట్లు తెలిసింది. ఈ విషయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో సంప్రదింపులు లేకుండా నల్గొండలో చేరిక జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కోమటిరెడ్డి ఇంటికి రేవంత్
నేతల మధ్య విబేధాలు వార్తల నేపథ్యంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. తర్వాత నేతలిద్దరూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి అటు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో చర్చించకుండా నల్గొండలో ఎవరి చేరిక జరగదని రేవంత్ తేల్చి చెప్పారు.
కలిసికట్టుగా పని చేస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న రేవంత్ అందుకోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమన్న ఆయన.. ఇందులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 17లో 15 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తిచూపుతున్నారన్న రేవంత్ రెడ్డి.. స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.