Telangana Congress: డిసెంబర్ 9న ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ తొలి సంతకం : రేవంత్
X
తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ వదులుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని అన్నారు. లక్ష కోట్లు సహా 10వేల ఎకరాల భూములను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు.
అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారన్నారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్కు చలి జ్వరం వచ్చిందని రేవంత్ సెటైర్ వేశారు. కేసీఆర్ ఇకపై ఫాంహౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదన్నారు. డిసెంబర్లో అద్బుతం జరగనుందని.. కాంగ్రెస్ను గెలపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
డిసెంబర్ 9, 2023న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ తొలి సంతకం ఉంటుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. లేకపోతే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ చేశారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే బీజేపీ ప్రయత్నస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ - బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు.