మోదీ, కేసీఆర్ దేశ సంపదను వాళ్లకు దోచి పెడుతున్నారు : రేవంత్
X
దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. దేశానికి రాజీవ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారని చెప్పారు. యువతకు 18ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది అన్నారు. యువతకు రాజీవ్ స్ఫూర్తి నిలిచారని కొనియాడారు.
“ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు చేర్చారు. రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేశారు. దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారు. రాజీవ్ స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ విభజించు పాలించు అనే విధానాన్ని అవలంభిస్తోందని రేవంత్ విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని మరోసారి స్పష్టం చేశారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే.. కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.