కేసీఆర్ పండించిన వడ్లను ఎంతకు కొంటున్నారో తెలుసా..? : రేవంత్
X
ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈవీఎంలను మార్చి గెలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్కు మద్ధతుగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ధర్మపురి అభివృద్ధికి ఈశ్వర్ చేసిందేమి లేదని విమర్శించారు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి.. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని అన్నారు. పక్కనే గోదావరి ఉన్నా.. ధర్మపురికి సాగు నీరు, తాగునీటి సమస్య తీరలేదన్నారు. కొప్పుల ఈశ్వర్ ఈ సారి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ దళిత బంధు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి ఒక్క హామీని నెరవేర్చలేదని రేవంత్ అన్నారు. ప్రాజెక్టు రీడిజైనింగులతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతితో మేడిగడ్డ కుంగిపోయిందని.. ఇసుకలో కట్టడానికి అవి పిట్టగోడలు కావు.. ప్రాజెక్టులు అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్న సొమ్మంతా కక్కిస్తామన్నారు.
ఫాంహౌస్లో కేసీఆర్ పండించిన వడ్లను కావేరి సీడ్స్ కంపెనీ క్వింటాల్కు 4250 రూపాయలకు కొంటునందని రేవంత్ ఆరోపించారు. మరి రైతుల వడ్లకు కనీసం 2వేలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. రైతులకు 16వేల పెట్టుబడి సాయం, 2లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు 2వేల నగదు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, విద్యార్థులకు 5లక్షల చేయూత, గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధి తీసుకొస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇవన్నీ జరగాలంటే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.