Home > తెలంగాణ > గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే సస్పెన్షన్లే - రేవంత్ రెడ్డి

గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే సస్పెన్షన్లే - రేవంత్ రెడ్డి

గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే సస్పెన్షన్లే - రేవంత్ రెడ్డి
X

గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే సస్పెన్షన్లే ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రేవంత్‌ సూచించారు. కమిటీల నియామకంలో ఏవైనా అభ్యంతరాలుంటే.. పార్టీ ఆర్గనైజింగ్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని రేవంత్ సూచించారు. పార్టీ వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

పార్టీ పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు కొన్నాళ్లుగా గాంధీభవన్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. శనివారం రేవంత్‌ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చే సమయానికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ నిరసనలపై రేవంత్‌ స్పందించారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క మండలాన్ని మహిళకు ఇస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే వివరాలు సేకరించి సస్పెండ్ చేయాలని గాంధీ భవన్ ఇంఛార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు సూచించారు. మరోవైపు మండల కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేయాలని రేవంత్ ఆదేశించారు.

Updated : 15 July 2023 9:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top