Home > తెలంగాణ > 24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు కేటీఆర్ సిద్ధమా ? : రేవంత్ రెడ్డి

24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు కేటీఆర్ సిద్ధమా ? : రేవంత్ రెడ్డి

24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు కేటీఆర్ సిద్ధమా ? : రేవంత్ రెడ్డి
X

24 గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. వ్యవసాయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్‎ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ 24 గంటల విద్యుత్‌పై చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు

ఉచిత విద్యుత్‎ను కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని మాత్రమే తాను చెప్పానని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై కేటీఆర్ కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తున్నారన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వకుండా ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపించి.. రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. 24గంటల కరెంటుపై ఆధారాలతో చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేను అక్కడికి వస్తానన్నారు. సిరిసిల్ల,చింతమడక, గజ్వేల్ రైతు వేదికలో ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. వ్యవసాయానికి అవసరమైనంత మాత్రమే కరెంట్ ఇస్తున్నామని అధికారులే స్వయంగా ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. " రాహుల్ గాంధీకి క్లబ్బు, పబ్బు తప్ప వ్యవసాయం తెలియదంటావా? తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వారసుడిపై అంత మాట అంటావా? పగలుకు,రాత్రికి తేడా తెలియని నువ్వు రాహుల్ ను విమర్శిస్తావా? అసలు కేటీఆర్‎కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా?

దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‎కు వ్యవసాయం తెలియదు. రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా..రాహుల్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ ను ఎక్కడికక్కడ అడ్డుకోండి. 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి.రుణమాఫీ, పోడు భూముల పట్టాలు 24 గంటల కరెంటు ఇచ్చే వరకు..బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండి" అని పిలుపునిచ్చారు.

బీజేపీది..బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ది జలయజ్ఞం అయితే బీఆర్ఎస్ ది ధనయజ్ఞం అని ఎద్దేవ చేశారు. "కేసీఆర్ నాయకత్వంపై హరీష్ రావుకు విశ్వాసం ఉంటే.. కేసీఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం లాంటిది. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కు గజ్వేల్ లో పోటీ చేయడానికి భయం ఎందుకు? సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


Updated : 17 July 2023 7:47 PM IST
Tags:    
Next Story
Share it
Top