హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
X
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అంతా అల్లకల్లోలంగా మారింది. ఎక్కడికి వెళ్లు పరిస్థితి లేకపోయింది. నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.
ఇదిలా ఉండగా మున్నేరు నది మహా ఉగ్రరూపం దాల్చింది. వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో గురువారం (జులై 27) హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (NH65)పై భారీగా వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గం ఐతవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. కొందరు సాహసం చేసి వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఐతవరం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు.