Traffic Challan:వాహనదారులకు అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు రేపే లాస్ట్ ఛాన్స్
X
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ చలాన్లుపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బైకులు, ఆటోలకు 80శాతం.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చింది. దీంతో అనూహ్య స్పందన లభిస్తోంది. గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలాన్లకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ అవకాశం రేపటి వరకే.. అంటే ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే ఉంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ సూచించారు. చెల్లింపులకు ఈరోజు, రేపు గడువు ఉండటంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. చలాన్లు చెల్లించే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. అధికారిక వెబ్ సైట్, పేమెంట్ యాప్ లలో మాత్రమే చలాన్లు కట్టాలని సూచిస్తున్నారు. చలానాల చెల్లింపులో ఏమైనా సందేహాలు ఉంటే.. 040-27852721, 87126616909(వాట్సాప్) నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్‌తో సుమారు 2 లక్షల వాహనదారులకు ప్రయోజనం కలుగనున్నది. హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్‌ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఇన్సూరెన్స్ లేకపోవడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్‌లో వాహనం నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించించడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.