వాహనదారులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
X
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా శనివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయనుండగా.. మరికొన్ని రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
మొహర్రం సందర్భంగా బీబీ కా ఆలం డబీర్పురా నుంచి చాదర్ ఘట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. చార్మినార్, గుల్జార్ హౌజ్, బీబీ కా అలవా రోడ్డు, షేక్ ఫయాజ్ కమాన్, యాకుత్ పురా రోడ్డు, సూరజ్ టాకీస్, సర్ధార్ మహల్, పంజేషా, మీర్ ఆలం మండి, పురాని హవేలీ, దారుల్ షిఫా, మెస్కో, ఇమ్లిబన్ రూట్లలో పోలీసులు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయడం లేదా దారి మళ్లించడం చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తమకు సహకరించాలని.. రద్దీగా వున్న సమయంలో ఇతర మార్గాలను చూసుకోవాలని సూచించారు.
జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రంగ్ మహల్, అఫ్జల్ గంజ్ వైపు మళ్లించనున్నారు. ఊరేగింపు పూర్తయ్యే వరకు కాళీ కబర్, మీరాలం మండి వైపు బస్సులను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు సికింద్రాబాద్ పరిసరాల్లోనూ శనివారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ట్యాంక్ బండ్ నుంచి కర్బలా మైదాన్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ నుంచి కవాడీగూడ, బైబిల్ హౌస్, ఆర్పీ రోడ్ వైపు మళ్లిస్తారు. ఆర్పీ రోడ్ నుంచి కర్బలా మైదాన్ వైపు వచ్చే వెహికిల్స్ నుంచి బైబిల్ హౌస్ ట్రాఫిక్ ఐలాండ్ నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్స్ మీదుగా డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు పంపుతారు.