గోల్కొండ బోనాలు... దశాబ్ధి ఉత్సవాలు.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
X
నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభం కానుంది. మరోవైపు ఈరోజు నుంచే రాష్ట్రంలో ఆషాడ బోనాలు మొదలు కానున్నాయి. అటు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, ఇటు గోల్కొండ బోనాలు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మారక కేంద్రం వరకు కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులకు వెళ్లే దార్లను మూసేయనున్నారు. వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ, కర్బాల మైదాన్, రాణిగంజ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదాన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా మళ్లించనున్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపునకు ట్రాఫిక్‌కు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు.
ఇక గోల్కొండ బోనాలు ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గోల్కొండకు వచ్చే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ నెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20 తేదీల్లో బోనాల పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్‌గూడ నుంచి మక్కీ దర్వాజ నుంచి గోల్కొండ కోట, లంగర్‌హౌస్ నుంచి ఫతేదర్వాజ నుంచి గోల్కొండ, సెవెన్ టూంబ్స్ నుంచి బంజారా దర్వాజ నుంచి గోల్కొండ కోట మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. రామదేవ్‌గూడ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు అషుర్‌ఖానా నుంచి మిలిటరీ సెంట్రీ పాయింట్ పార్కింగ్‌లో పార్కింగ్ చేయాలి. లంగర్‌హౌస్ నుంచి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను హుడా పార్కు వద్ద, నాలుగు చక్రాల వాహనాలను ఒవైసీ గ్రౌండ్, పుట్‌బాల్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి. షేక్‌పేట, సెవెన్ టూంబ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రియదర్శిని స్కూల్, ఏరియా ఆస్పత్రి, బస్టాప్‌ల వద్ద పార్కింగ్ చేయాలి.