సూర్యపేట జిల్లాలో విషాదం.. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య
X
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట మండలం ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ వైష్ణవి అనుమానస్పద స్థితిలో మరణించింది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తన ఫ్రెండ్స్ వెళ్లి చూడగా ఆమె అపస్మారకస్థితిలో కన్పించింది. కాలేజీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
వైష్ణవి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు మృతదేహంపై గాయాలు ఉన్నాయని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్ సహా పాఠశాల సిబ్బంది వేధింపులతోనే తమ కూతురు చనిపోయిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల భువనగిరిలో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మరో విద్యార్థిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.