కామారెడ్డిలో విషాదం..పాము కాటుకు తండ్రీ కొడుకు మృతి
X
కామారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది . పాము కాటుకు తండ్రీకొడుకులు బలయ్యారు. అర్ధరాత్రి సమయంలో గాఢనిద్రలో ఉండగా పాము కాటేయడంతో నిద్రలోనే ప్రాణాలను విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జనావాసాల నడుమ విష సర్పాలు సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. రోజూలాగే వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికి వచ్చిన రవి తన కొడుకు వినోద్‌తో కలిసి ఇంట్లో పడుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దూరిన పాము హఠాత్తుగా వారిద్దరినీ కాటేసింది. తిమ్మిర్లు వస్తున్నాయని రవి నిద్ర లేసి విషయాన్ని భార్యకి తెలిపాడు. పాము కాటు వేసి ఉండొచ్చని భావించాడు. అయితే పక్కనే పడుకున్న కొడుకును చూడగా అప్పడికే ఆ బాలుడు చనిపోయాడు. పరిస్థితి విషమించడంతో రవిని గ్రామస్తులు కామారెడ్డి సర్కార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది.
చికిత్స పొందుతూ రవి ఆస్పత్రిలోనే మరణించాడు.