గుండెల్ని పిండేసే విషాదం.. తమ్ముడి పెద్దకర్మ రోజే అన్న కూడా..
X
తమ్ముడు గుండెపోటుతో మరణించగా.. అతడి దశదిన కర్మ రోజు అన్న కూడా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట లో చోటుచేసుకున్నది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి, అరుణ దంపతులకు ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) అనే ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఉమ్మెంతల మధుసూధన్ రెడ్డి హైదరాబాద్‌లో పైవ్రేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.
ఈ నెల 3న ఛాతిలో నొప్పి రావడంతో ఓ ఆసుపత్రిలో చేరాడు మధుసూధన్ రెడ్డి . అక్కడి డాక్టర్లు అంజియోగ్రాం నిర్వహించారు. ఆ రిపోర్ట్ రాకముందే గుండెపోటుకు గురై మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఉమ్మెంతల శ్రీకాంత్‌రెడ్డి కరీంనగర్‌లో ఒక ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మధుసూధన్‌రెడ్డి(తమ్ముడు) చిన్నకర్మ ఆదివారం రేణికుంటలో నిర్వహించారు. అక్కడ ఏర్పాట్లు చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డి (అన్న) గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే కరీంనగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు శ్రీకాంత్‌రెడ్డికి సర్జరీ చేశారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మరణించాడు. ఆయన మృతదేహాన్ని రాత్రి రేణికుంటకు తీసుకువచ్చారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు చంద్రారెడ్డి, అరుణ... ఇక మాకు దిక్కెవరూ అంటూ రోదించారు.