వాళ్లను బదిలీ చేయండి..తెలంగాణ సర్కార్‌కు కేంద్రం ఆదేశం
X
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఓ వైపు ప్రధాన పార్టీలు తమ బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎలక్షన్స్‌లో భాగస్వాములయ్యే ఎంప్లాయిస్ మూడేళ్లు ఒకే దగ్గర విధులు నిర్వహించకూడదనే నిబంధనను ఎన్నికల సంఘం కొత్తగా తీసుకువచ్చింది . అలాంటి ఉద్యోగులు, అధికారులు ఎవరు ఉన్నా కూడా వారిని గుర్తించి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ఈ 5 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ముఖ్య ఎన్నికల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసింది. సొంత జిల్లాలో లేదా వారి సొంత నియోజకవర్గాల్లో వరుగా 3 ఏళ్లు విధులు నిర్వహించిన అధికారులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే ట్రాన్ఫర్ చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. జులై 31 తేదీని డెడ్ లైన్‌గా విధించింది. ఆ సమయానికల్లా బదిలీల ప్రక్రియ పూర్తిచేసి లిస్టును పంపాలని అధికారులను ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైన తేదీలను కొలమానంగా తీసుకుని బదిలీల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల వ్యవధిని లెక్కించేందుకు 2024 జనవరి 31వతేదీని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
బదిలీలు ఎవరికి వర్తిస్తాయంటే...
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే వారికే ఈ బదిలీలు వర్తిస్తాయి. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో విధులు నిర్వహించే జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు తాజా ఉత్తర్వుల నేపథ్యంల ఒకేచోట మూడేళ్లు పనిచేసి ఉంటే వారిని ట్రాన్ఫర్ చేస్తారు. పోలీసుశాఖలోనూ ఐజీ రేంజి నుండి డీఐజీలు, కమాండెంట్లు, జిల్లా ఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ఐల వరకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఐలను ఎలాంటి పరిస్థితుల్లో వారి సొంత జిల్లాలో నియమించకూడదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారి సొంత ప్రాంతంలో పని చేసేవారైనా, వారికి స్థాన చలనం కల్పించాలి. ఎన్నికల సంఘం తాజా నిబంధనల మేరకు అధికారులు వెంటనే వారి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.