Home > తెలంగాణ > Telangana Assembly Elections 2023: ఇంటి నుంచే ఓటు.. Vote from Homeకి అర్హులు ఎవరంటే..?

Telangana Assembly Elections 2023: ఇంటి నుంచే ఓటు.. Vote from Homeకి అర్హులు ఎవరంటే..?

Telangana Assembly Elections 2023: ఇంటి నుంచే ఓటు.. Vote from Homeకి అర్హులు ఎవరంటే..?
X

మరో 40 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్న ఎన్నికల కమిషన్(Chief Election Officer).. దివ్యాంగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలింగ్ బూత్ వరకు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది . ఈ నేపథ్యంలో ఈ సారి జరుగబోయే ఎన్నికల్లో 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, నడువలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతున్నది. ఇందుకోసం అధికారులు ముందుగానే కసరత్తు పూర్తి చేసి.. ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ఓటింగ్ నమోదు చేయించాల్సి ఉంటుంది. హోమ్​ ఓటింగ్ ప్రక్రియ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 12డీ ఫారాన్ని నింపి రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ)కి ఇవ్వాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 5 రోజుల పాటు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే నవంబర్ 3 నుంచి 8వ తేదీవరకు Vote from Home కోసం అప్లై చేసుకోవాల్సివుంటుంది. పూర్తి చేసిన ఫార్మ్ 12డి అప్లికేషన్లను నిర్దేశించిన గడువులోగా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్ 12డీ ఫారాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ పొందుపరచాల్సి ఉంటుంది. ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. సీరియల్ నంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. వృద్ధులైతే తమ వయసు, వికలాంగులైతే పర్సన్ విత్ డిజెబిలిటీ అనేది టిక్ చేయాలి.

అప్లికేషన్లను పరిశీలించిన తరువాత అర్హతను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అర్హత ఉన్న వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. ఇంటి వద్ద ఓటు తీసుకున్నా.. ఎవరికి ఓటు వేస్తున్నారనేది రహస్యంగా ఉంచేందుకు పోలింగ్ బూత్‌లో చేసే ఏర్పాట్లే ఇళ్ల వద్ద చేయనున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియను వీడియో తీస్తారు. ఈ విధానంపై పార్టీలకు కూడా సమాచారం ఇస్తారు. ఇక ఇంటి నుంచి ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోని వృద్ధులు, వికలాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాలన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి వలంటీర్లను ఉంచుతున్నారు.

Updated : 22 Oct 2023 4:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top