ఆర్టీసీ కార్మికులతో చర్చలు.. వెనక్కి తగ్గిన గవర్నర్..!
X
తెలంగాణలో ఆర్టీసీ బిల్లుపై సీఎం వర్సెస్ గవర్నర్గా పరిస్థితి మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుని.. ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే ఆ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ వివరణను కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు గవర్నర్ తీరును నిరసిస్తూ రాజ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి 8గంటల వరకు ఆర్టీసీ డిపోల వద్ద బంద్ పాటించారు.
ఆందోళన చేస్తున్న కార్మికులతో గవర్నర్ చర్చలు జరిపారు. పుదుచ్చేరి నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గవర్నర్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ యూనియన్ లీడర్ థామస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వివరణ ఇంకా తనకు అందలేదని.. అది అందగానే బిల్లును ఆమోదిస్తానని చెప్పారన్నారు. కార్మికుల ప్రయోజనాలకు తాను వ్యతిరేకం కాదని.. అసెంబ్లీ సెషన్ అయ్యేలోపే బిల్లును ఆమోదించేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.
గవర్నర్ 5 సందేహాలు ఇవే..
1. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం అందించిన గ్రాంట్లు, షేర్లు, లోన్లుకు సంబంధించిన వివరాలు ఏవీ బిల్లులో లేవు.
2. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ ప్రస్తుత స్థితిని మార్చడంపైన సరైన వివరాలను బిల్లులో తెలపలేదు.
3. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విషయమై ఎక్కడా ప్రస్తావించలేదు. వీరికి కార్మిక చట్టం వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అదే విధంగా వీరికి కలిగే ప్రయోజనాలు ఎలా రక్షించబడతాయని అడిగారు.
4. ప్రమోషన్లు, క్యాడర్ నార్మలైజేషన్లో ఆర్టీసీ ఎంప్లాయిస్కు న్యాయం చేసే విషయంపైనా ఎలాంటి క్లారిటీ లేదన్నారు.
5. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన హామీలను బిల్లులో పొందుపరచాలని సర్కార్కు సూచించారు.