త్వరలోనే ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులు : హరీష్ రావు
X
తెలంగాణలోని ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్ కార్డులు అందించనుంది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. హరీష్ రావు ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించాలని, ఇందుకోసం లబ్ధిదారుల ఈ-కేవైసీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి అనుమతి ఇచ్చేలా ఈ మీటింగ్‌లో నిర్ణయించారు. బయోమెట్రిక్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించింది.
కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి ఒక కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని బోర్డులో నిర్ణయించారు. MGM వరంగల్‌లో కూడా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండగా.. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు చేర్చినట్లు హరీష్ రావు చెప్పారు.