Home > తెలంగాణ > TS Gurukula Jobs: రాష్ట్రంలో 9210 ఉద్యోగాలు... నేటి నుంచే పరీక్షలు

TS Gurukula Jobs: రాష్ట్రంలో 9210 ఉద్యోగాలు... నేటి నుంచే పరీక్షలు

TS Gurukula Jobs: రాష్ట్రంలో 9210 ఉద్యోగాలు... నేటి నుంచే పరీక్షలు
X

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్‌ ఆధారంగా జరిగే ఈ రాత పరీక్షలు(CBRT) ఆగస్టు 1 నుంచి 23 వరకు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లను https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు అధికారులు చేసిన కొన్ని కీలక సూచనలివే..

1.ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్‌, ఫొటో తీసుకుంటారు. అభ్యర్థులందరూ తమకు సూచించిన సమయంలోపే ఎగ్జామ్ సెంటర్స్‌కు చేరుకోవాలి.

2. ఈ పరీక్షలు మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది.

3. ప్రతి షిఫ్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు.

4. ఒక్కసారి ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అయ్యాక మళ్లీ ఎగ్జామ్ అయ్యాకే బయటకు

5. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు తప్పనిసరి. లేకుంటే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు.

6. హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్‌ కాకుంటే మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలపై గెజిటెడ్‌ ఆఫీసర్ కన్ఫర్మేషన్, అండర్‌టేకింగ్‌ కన్ఫర్మేషనన్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేకుంటే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు.

7. కాగితాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లతో ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు.

8. హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డు, నామినల్‌ రోల్‌లలో ఫొటోలు వేర్వేరుగా ఉన్నా.. అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణలో లోపాలు గుర్తించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు భద్రంగా ఉంచుకోవాలి.

9. పరీక్ష పేపర్‌-1, 2, 3లో తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత ఉంటుంది.

10. పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు పాస్‌వర్డ్‌ చెబుతారు. కంప్యూటర్‌లో దీన్ని నమోదు చేశాక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు వస్తాయి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి స్క్రీన్‌పై ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. గడువు ముగిసిన తరువాత స్క్రీన్‌ అదృశ్యమవుతుంది. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కంప్యూటర్‌ ఆటోమేటెడ్‌గా అదనపు సమయం ఇస్తుంది.


Updated : 1 Aug 2023 7:49 AM IST
Tags:    
Next Story
Share it
Top