తెలంగాణోళ్లకే 85 శాతం మెడికల్ సీట్లు.. ఏపీ స్టూడెంట్స్ కు షాకిచ్చిన హైకోర్టు..
X
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక విద్యార్థులకు 85శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 72ను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఆలిండియా కోటాలో 15 శాతం ఓపెన్ కోటా పోనూ కాంపిటేటిట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే చెందేలా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవో 72ను వ్యతిరేకిస్తూ ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది.
2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్థించడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. హైకోర్టు తీర్పుతో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటు, వాటి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైందని హరీష్ అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో 85శాతం సీట్లను లోకల్ రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని ట్వీట్ చేశారు.
హైకోర్టు తాజా తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఏటా 1820 సీట్లు దక్కనున్నాయని ఇది దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమని చెప్పారు.